TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, దమ్మపేట మండలం, జూన్17. అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో రూ.1 కోటి 20 లక్షల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను
మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, రవాణా, చిన్నారుల సంక్షేమానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా పలు పనులకు శ్రీకారం చుట్టారు. అంకంపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కొడిసెలగూడెంలో టిడబ్ల్యూయూపీఎస్ పాఠశాల ప్రహరీ గోడ, పట్వారిగూడెంలో రూ.36 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, బాలరాజుగూడెం దిబ్బగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ గోడ, మెండివారిగూడెంలో రూ.11.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే నాగుపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన ఆధునిక అంగన్వాడీ భవనం, తొట్టిపంపు, గొర్రెగుట్ట గ్రామాల్లో పాఠశాల ప్రహరీ గోడలు, కొత్తూరు అంగన్వాడీ భవనం, పాత చీపురుగూడెం ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ గోడలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలపడితేనే పల్లెల్లో పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచి విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రోడ్లు, విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎంఎల్ఏ జారె పేర్కొన్నారు.