వెబ్ న్యూస్ – మే 14/26). సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో రైతుల పక్షాన పోరాటమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య… కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెనుబల్లి తాసిల్దార్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
రైతాంగాన్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతులతో కలిసి ఆందోళన వ్యక్తం చేస్తూ….. ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.
మార్చి నెలలోనే వరికోతలు ప్రారంభమైనప్పటికీ, రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేపట్టిన తర్వాతే హడావుడిగా కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతులు పడుతున్న బాధలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే సండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో 70 శాతం వరి ధాన్యం రైతులు ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకోవాల్సి వచ్చిందని, మిల్లర్లు బస్తాకు 12 కేజీల వరకు తరుగు తీసి రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు క్వింటాకు రూ.800 వరకు నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు భరోసా, గన్ని బ్యాగులు, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని, బస్తాలు ఇవ్వాలన్నా, కాంట వేయాలన్నా, రైతులు ఏ పార్టీకి చెందిన వారు అని చూసే పరిస్థితి ఏర్పడిందని, కేసీఆర్ గారి హయాంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి గింజ కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలిచామని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి పెడుతోందని సండ్ర ఆరోపించారు.
అనంతరం పెనుబల్లి తహసిల్దార్ కు మెమోరాండం అందజేసిన సండ్ర వెంకట వీరయ్య, ఐకేపీ ఏపీఎంను కలిసి గత 50 రోజులుగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర అధికారులను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శీలపు రెడ్డి హరికృష్ణ రెడ్డి, పెనుబల్లి మండల అధ్యక్షులు కనగాల వెంకటరావు, మండల సీనియర్ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు, వినీల్, అలాగే పంచాయతీ వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.