TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 18. రాబోయే రోజుల్లో వర్షాలు, నకిలీ విత్తనాల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలని, ఖమ్మం సిపి సునీల్ దత్త్ ముదస్తు చర్యలపై జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపి సునీల్ దత్త్ మాట్లాడుతూ… గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, గతంలో పడిన భారీ వర్షాలతో చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతి ప్రవహించడం ద్వారా దెబ్బ తిన్న వంతెనలు, చప్టలను సందర్శించడం, వరద ప్రభావం ఎంతవరకు వచ్చిందో పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి ప్రమాదాల భారీన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.అదేవిధంగా వర్షాల వల్ల ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా, నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ రోడ్లను క్లియర్ చేయాలని స్పష్టం చేశారు.
నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పకడ్బంది చర్యలు తీసుకోవాలని, ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ముఖ్యంగారైతులు సైతం విత్తనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తత పాటించాలన్నారు. తక్కువ ధరలకు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి మోసపోవద్దని అన్నారు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి, తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారిపై గ్రామాల్లో సైతం నిఘా పెట్టామని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే మండల వ్యవసాయ శాఖ అధికారికి గాని స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మార్కెట్ లో నకిలీ విత్తనాల విక్రయం జరుగకుండా టాస్క్ ఫోర్స్ బృందాల నిరంతరం పర్యవేక్షణ వుంటుందని తెలిపారు.