ఖమ్మం లీగల్, జూన్ 09 (TV6 24/7 NEWS): న్యాయవాదుల భద్రత, వృత్తి గౌరవ పరిరక్షణకు కీలకమైన న్యాయవాద రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఖమ్మం కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎడ్లపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం అవసరం చాలా కాలంగా ఉందని, ఆ అవసరాన్ని గుర్తించి న్యాయవాద రక్షణ చట్టం అమలు దిశగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సింగం జనార్ధన్ మాట్లాడుతూ……. తెలంగాణలో న్యాయవాదుల భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలనే డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉందని, ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం, లక్ష్యాలను వివరించారు.
చట్టం ప్రధాన లక్ష్యాలు
విధి నిర్వహణలో ఉన్న న్యాయవాదులపై దాడులను నిరోధించడం.
న్యాయవాదుల కార్యాలయాలు, పత్రాలు, ఆస్తులకు రక్షణ కల్పించడం.
బెదిరింపులు, హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం.
న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడం. అని అన్నారు
ప్రజలకు న్యాయం అందించడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని న్యాయవాదులందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సింగం జనార్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.