యాదాద్రి భువనగిరి జిల్లా, జూన్ 11 (TV6 24/7 NEWS): యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్పీడీసీఎల్ యాదాద్రి ఎస్‌ఈ సర్కిల్ కార్యాలయ భవనాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం సర్కిల్ ఆఫీస్ స్టోర్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేసి, భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఆధునిక మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో పీక్ డిమాండ్ 18,546 మెగావాట్లకు చేరినా ఒక్క నిమిషం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.

అదనపు పన్నులు విధించకుండా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇందిరమ్మ భీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించిన ఆయన, ఇప్పుడు అదే నాయకులు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, ఆయన కోరిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *