TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మంచిర్యాల, జూన్ 14. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని సందర్శించారు. ఓపెన్ హౌస్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి కార్మికులు, అధికారులతో కలిసి సింగరేణి కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల కఠోర శ్రమను, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భట్టి విక్రమార్క, రాజకీయ స్వార్థం కోసం సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజా ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు.
సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల అమూల్య ఆస్తి అని పేర్కొన్న ఆయన, సంస్థలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా ప్రక్రియలన్నీ పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలు, విద్యా అవకాశాలు, ప్రమాద బీమా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కార్మికుల పిల్లల ఉన్నత విద్యకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. సింగరేణిని దోచుకోవాలని లేదా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించిన భట్టి విక్రమార్క, సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.