TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పాల్వంచ, జూన్ 14. వేసవిలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు. భారతదేశపు అన్నపూర్ణగా తెలంగాణ మరోసారి తన ఘనతను చాటుకుందని అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 150 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సాధించిందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 27 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి, వారి ఖాతాల్లో రూ.35,537 కోట్లను జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వ, మిల్లింగ్, చెల్లింపుల ప్రక్రియలో అధికారులు సమన్వయంతో పనిచేసి 48 నుంచి 72 గంటల్లోనే రైతులకు చెల్లింపులు అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *