TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 17. చిన్నారులపై హింస, మహిళలపై వేధింపులను అరికట్టడంతో పాటు బాధితులకు సమగ్ర సేవలు అందించేందుకు ‘భరోసా’ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అడిషనల్ డీసీపీ రామానుజం అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. హింస, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు భరోసా కేంద్రాల ద్వారా పోలీస్, వైద్య, న్యాయ, మానసిక కౌన్సెలింగ్ సేవలను ఒకే వేదికపై అందిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ రామానుజం మాట్లాడుతూ….. బాధితులకు భయంలేని, సురక్షితమైన వాతావరణంలో తక్షణ రక్షణ, వైద్య సహాయం, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కోర్టు ప్రక్రియ వరకు న్యాయ నిపుణుల సహకారం అందిస్తూ, అవసరమైన వారికి తాత్కాలిక ఆశ్రయం, విద్య, స్వయం ఉపాధి శిక్షణ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తోడ్పడుతున్నామని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, చైల్డ్ లైన్ ప్రతినిధులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, కౌన్సిలర్లు, దర్యాప్తు అధికారులు పాల్గొన్నారు.