ఖమ్మం టౌన్, జూన్ 08 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పాకబండలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్ల నుంచి 18,548 మెగావాట్లకు పెరిగినా ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, డేటా సెంటర్లు వంటి ప్రాజెక్టులతో విద్యుత్ అవసరాలు మరింత పెరుగుతాయని, అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, 85 గ్రామాలను సంపూర్ణ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు ఉచిత విద్యుత్ కొనసాగుతోందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు ₹14 వేల కోట్లు ఖర్చు చేస్తోందని భట్టి తెలిపారు. అలాగే 53 లక్షల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రైతులకు మీటర్లు పెడతామని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ, “రైతులకు మీటర్లు పెట్టే పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయము. ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పేటెంట్ హక్కు” అని స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *