TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. సత్తుపల్లి అక్టోబర్ 20: ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడంలో నూతన వైద్యశాలలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శస్త్ర హాస్పిటల్’ను స్థానిక శాసనసభ్యురాలు డా. మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు చేరువ కావాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆసుపత్రి యాజమాన్యానికి, ప్రముఖ వైద్యులు డా. వినీత్ కృష్ణకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు డా. మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొని ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు. పట్టణ ప్రముఖ వైద్యులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు మంత్రి తుమ్మల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.