TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. సత్తుపల్లి అక్టోబర్ 20: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ దుర్గా నాగమల్లేశ్వర స్వామి దేవస్థానం పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో పునీతమయ్యాయి. మంగళవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ‘శివాద్రి గిరి ప్రదక్షిణ’ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రి పొంగులేటికి స్థానిక ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దంపతులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి శాస్త్రోక్తంగా గిరి ప్రదక్షిణను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే దంపతులు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు సుఖశాంతులతో వర్ధిల్లాలని, దుర్గా నాగమల్లేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పర్వదినం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, గిరి ప్రదక్షిణలో పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.