TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 02. పోలీసులుగా నటిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని నమ్మించి కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నకిలీ పోలీస్ ముఠాను సత్తుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఐపీఎస్ తెలిపారు.
గురువారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వసుంధర యాదవ్ తెలిపిన వివరాలు ప్రకారం, ఈ కేసులో మొత్తం 14 మంది నిందితుల్లో 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
నిందితులు బాధితులను రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు ఇస్తామని నమ్మించి, పిల్లల ఆడుకునే నోట్లతో నింపిన బ్యాగులు ఇచ్చిన అనంతరం కొందరు నిజమైన, మరికొందరు నకిలీ పోలీసుల వేషంలో వచ్చి నకిలీ కరెన్సీ వ్యవహారం పేరుతో నగదును స్వాధీనం చేసుకుని పరారయ్యేవారని వెల్లడించారు.
ఈ కేసులో సత్తుపల్లి మండలం బీ.గంగారం 15వ బెటాలియన్ కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్, ఆర్ఎస్ఐ బైరా కేశవరావు ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.17.60 లక్షల నగదు, రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగ కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి వెల్లడించారు.
ఇలాంటి బ్లాక్ మనీ మార్పిడితో వచ్చే ఆఫర్లు, అపరిచితుల ఫోన్ కాల్స్ను ప్రజలు నమ్మవద్దని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సత్తుపల్లి ఏసిపి వసుంధర యాదవ్ తెలియజేశారు.