TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి, జూలై 13 సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో వ్యవసాయం ప్రధానంగా కృష్ణా నదిపై నిర్మించిన నాగార్జునసాగర్ ఎడమ కాలువ (ఎల్బీసీ) ద్వారా అందే సాగునీటిపైనే ఆధారపడి సాగుతుంటుంది.
అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో కృష్ణా నదిలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో ఈ ప్రాంతం మొత్తం కరువు బారిన పడుతుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది. పంటలు సాగు చేయలేమేమోననే భయంతో రైతులు తీవ్ర అయోమయంలో ఉన్న సమయంలో గోదావరి జలాలు రాజీవ్ లింకు కాలువ ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవడం రైతులకు గొప్ప ఊరటనిచ్చిందని సత్తుపల్లి ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షురాలు కోమటి జ్యోతి కృష్ణారావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దూరదృష్టితో తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయం వలనే రాజీవ్ లింకు కాలువ ద్వారా ఖమ్మం జిల్లాలోని తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని తెలిపారు.
ఈ నీటితో లక్ష ఎకరాలకు పైగా రైతులు ధైర్యంగా సాగు ప్రారంభించారని, ఈ సంవత్సరం కరువు భయాలు తొలగిపోయి వ్యవసాయంపై మళ్లీ ఆశలు చిగురించాయని అన్నారు. రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ఈ ప్రాజెక్టు నేడు సత్తుపల్లి నియోజకవర్గ వ్యవసాయానికి వరంగా మారిందని కొనియాడారు.
రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సేవలను ఈ సందర్భంగా ఆమె అభినందిస్తూ, ఇలాంటి దూరదృష్టి కలిగిన నాయకుల అభివృద్ధి కార్యక్రమాలే భవిష్యత్ తరాలకు భరోసానిస్తాయని పేర్కొన్నారు.