TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 23. సత్తుపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ భూ సర్వే ప్రక్రియపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు మాట్లాడుతూ…. నియోజకవర్గంలోని రైతుల నుండి భూ సమస్యలు, సర్వే జాప్యం, పాస్ పుస్తకాలకు సంబంధించి తనకు వచ్చిన పలు ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూడాలని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన కలెక్టర్ దివాకర మాట్లాడుతూ… భూ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో సత్తుపల్లి ఎఎంసి చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ శ్రీమతి బొంతు సుమలత, స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.