TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, దమ్మపేట మండలం, ఆగస్ట్ 19. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్ద గొల్లగూడెంలోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్‌ను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం సాయంత్రం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డితో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వంటశాలలో విద్యార్థుల కోసం తయారుచేసిన భోజనం, కూరలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం సాయంత్రం సాంబారు, కోడిగుడ్లు అందించాల్సి ఉండగా, మధ్యాహ్నం మిగిలిన చారునే సాయంత్రం విద్యార్థులకు వడ్డిస్తున్నట్లు గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టాక్ రూమ్‌ను పరిశీలించి కూరగాయలు, పండ్లను అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచడంపై వార్డెన్‌పై ఎమ్మెల్యే జారె మండిపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని, వారిని సొంత పిల్లల్లా భావించి పరిశుభ్రమైన వసతి, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి సమక్షంలోనే వార్డె న్ హెచ్చరించారు. సంబంధిత అధికారులు పాఠశాల, హాస్టల్‌పై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.