TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి, అక్టోబర్ 13: అడవి గంగాదేవిపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కనగాల సాంబశివరావు ఉదయం, సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నపూర్ణ దేవి కృపతో గంగాదేవిపాడు గ్రామ ప్రజలు సకల సంపదలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహిస్తున్న వివిధ అలంకరణలు, ప్రత్యేక పూజలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా అడవి గంగాదేవిపాడు గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు కోలాట నృత్యాలతో భక్తులను అలరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *