TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. సత్తుపల్లి అక్టోబర్ 15. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే పరిస్థితులను కూడా బీఆర్ఎస్ రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం సరికాదని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ వ్యాఖ్యానించారు.

వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే సమస్యలను ప్రభుత్వ వైఫల్యాలుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 1951 నుంచి 2026 వరకు దేశంలో ఇలాంటి పరిస్థితులు 16 సార్లు ఎదురైనట్లు పేర్కొంటూ, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు ప్రభుత్వాల నియంత్రణలో ఉండవని గుర్తు చేశారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవడం, వారికి భరోసా కల్పించడం మా ప్రభుత్వం బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యతే అయినప్పటికీ, ప్రకృతి పరిణామాలను రాజకీయ విమర్శలకు వాడుకోవడం వలన ప్రజలకు ప్రయోజనం ఉండదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ రైతుల్లో ధైర్యం నింపి, వారికి అండగా నిలవాల్సిన సమయంలో ప్రతి సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని అనడం ఎంతవరకు సమంజసమని బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు, ఆ విపత్కర పరిస్థితులలో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదా అని ప్రశ్నించారు ?

ప్రకృతి, వాతావరణ పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేయడంలో తప్పులేదని, అయితే ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో చూడటం సరికాదని హితవు పలికారు. ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో బిఆర్ఎస్ నాయకులు విమర్శలకే పరిమితమైతే ప్రజల్లో చులకనయ్యే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *