TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. ఖమ్మం, జూలై 29: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి రూ.7.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9,200 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ ద్వారా 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణభారం తగ్గించామని తెలిపారు. సన్న వరిధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నట్లు చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని, ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 7 లక్షల ఇళ్లను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. రాబోయే విడతల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీతో పాటు గ్రామీణ రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *