TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్ ములకలపల్లి, ఆగస్టు 8: అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం ధర్మన్న నగర్ గిరిజన, గొత్తికోయ నివాస ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటెయినర్ ఆధారిత అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం పండుగ వాతావరణంలో ఘనంగా ప్రారంభించారు.
డైనాటా సంస్థ CSR నిధులు (2026-27), సమారిటన్స్–ఫర్ ది నేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు వందన గౌడ్, డైనాటా సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు గిరిజనులు, గొత్తికోయలు సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలు, ఆచార వ్యవహారాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇదే వేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు ప్రాథమిక విద్య, పౌష్టికాహారం, మెరుగైన సంరక్షణ అందించడమే లక్ష్యంగా ఆధునిక కంటెయినర్ ఆధారిత అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి CSR నిధులతో సహకరించిన డైనాటా సంస్థకు, సమారిటన్స్–ఫర్ ది నేషన్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూతన అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుతో తమ పిల్లలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చాయని గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, NGO ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంజా రవి,మాజీ ZPTC బత్తుల అంజి,మాజీ సర్పంచ్ కారం సుధీర్, యూత్ కాంగ్రెస్ నాయకులు సుమిత్,వంశీ, సేవాదళ్ నాయకులు తిరపతి రెడ్డి,పిడి మేడం,సీడీపీఓ మేడం,కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, NGO ప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.