మహిళలతో కలిసి బతుకమ్మ ఎత్తుకొని కోలాటం ఆడిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి, అక్టోబర్ 17: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వర ఆధ్వర్యంలో వి ఎం బంజర్ సర్పంచ్ భూక్య ప్రసాద్ ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మహిళలతో కలిసి బతుకమ్మను ఎత్తుకొని, వారితో కలిసి కోలాటం ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, మహిళల కోలాటాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పాయి. ఈ కార్యక్రమంలో మహిళలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.