TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం టౌన్, ఆగస్ట్ 19: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేయడంతో పాటు అంతర్రాష్ట్రాలకు తరలించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ అక్రమంగా ఆర్థిక లాభాలు ఆర్జిస్తున్న కాజా రామారావు @ జయంతి రామారావుపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలానికి చెందిన నిందితుడు రేషన్ డీలర్లు, వారి ఏజెంట్ల ద్వారా కార్డుదారులకు అందాల్సిన సబ్సిడీ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించేలా లబ్ధిదారుల బయోమెట్రిక్ వేలిముద్రలను దుర్వినియోగం చేసి బియ్యాన్ని కొనుగోలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
2026 ఏప్రిల్ 28 నుంచి మే 26 వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని కల్లూరు, తల్లాడ, ఎర్రుపాలెం, చంద్రుగొండ పోలీస్ స్టేషన్లలో పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోలుకు సంబంధించి నిందితుడిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయని, BNS, ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్, తెలంగాణ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్స్లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
గతంలోనూ ఇదే తరహా అక్రమ వ్యాపారానికి సంబంధించి 2024లో తల్లాడ, కల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుడిపై మరో రెండు కేసులు నమోదైనప్పటికీ తన కార్యకలాపాలను కొనసాగించినట్లు సీపీ తెలిపారు.
పేదలకు ఉద్దేశించిన ఆహార భద్రత వ్యవస్థకు విఘాతం కలిగిస్తూ, నిత్యావసర వస్తువుల సరఫరా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్న ఇలాంటి కార్యకలాపాలను ఉపేక్షించబోమన్నారు. నిందితుడిపై గతంలో పలుమార్లు కేసులు నమోదవడంతో పాటు BNSS సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పీడీ యాక్ట్ అమలు చేసినట్లు తెలిపారు.
ఈ మేరకు సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం కాజా రామారావును బుధవారం అదుపులోకి తీసుకుని హైదరాబాద్లోని చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని సీపీ సునీల్ దత్ స్పష్టం చేశారు.