అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్‌.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు పిలుపు

పెనుబల్లి, అక్టోబర్ 5: ఏ ఒక్కరి ఓటు కూడా తొలగింపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని పెనుబల్లి మండల అఖిలపక్ష నాయకులు తహసీల్దార్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం మండల పరిషత్ కార్యాలయ సముదాయం వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కు అని, ఏ కారణంతోనూ అర్హులైన పౌరుల ఓట్లను తొలగించకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉందన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల కమిషన్‌ అధికారుల ఎంపిక కమిటీలో గతంలో ఉన్న విధానాన్ని పునరుద్ధరించి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా స్థానం కల్పించాలని వారు కోరారు.

కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకులు, పౌర హక్కుల సంఘం, రైతు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. దేశ పౌరులకు ఓటు హక్కు లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యం కాదన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియపై ప్రజల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని వారు ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, సీపీఎం, మాస్‌లైన్‌, సీపీఐ జిల్లా నాయకులు చలమాల విఠల్‌రావు, బీరెల్లి లాజర్‌, పొదిల భాస్కర్‌, కాంగ్రెస్‌ నాయకులు చీకటి రామారావు, కీసర శ్రీనివాసరెడ్డి, రాజబోయిన కోటేశ్వరరావు, గూడూరు మాధవరెడ్డి, ఈడా కమలాకర్‌రావు, గంగదేవిపాడు సర్పంచ్‌ రాధాకృష్ణ, మిట్టపల్లి కిరణ్‌కుమార్‌, మేకతొట్టి కాంతయ్య, తాళ్లూరి శేఖర్‌రావు, గోదా చెన్నారావు, కొల్లి ప్రసాదరావు, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాటినేని శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా నాయకులు చిట్టి మోదుల కృష్ణ, నల్లమల అరుణ్‌ ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *