మండలంలో సీపీఎం బలోపేతానికి చలమాల సూర్యనారాయణ చేసిన కృషి అభినందనీయం: చలమాల విఠల్రావు
పెనుబల్లి, అక్టోబర్ 15 : తాను నమ్మిన సిద్ధాంతం కోసం, పేదల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు చలమాల సూర్యనారాయణ అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు అన్నారు. గురువారం వీఎం బంజర్లోని సీపీఎం కార్యాలయంలో మండల కమిటీ సభ్యులు నల్లమల అరుణ్ ప్రతాప్ అధ్యక్షతన చలమాల సూర్యనారాయణ 43వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్రావు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులపై కాంగ్రెస్ పెత్తందారులు అణచివేత ధోరణి అవలంబిస్తున్న సమయంలో కాంగ్రెస్ను విభేదించి సీపీఎంలో చేరిన చలమాల సూర్యనారాయణ అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారని తెలిపారు.
పెనుబల్లి మండలంలో పార్టీ బలోపేతానికి చలమాల సూర్యనారాయణ విశేష కృషి చేశారని, బూర్జువా శక్తులను ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఆయన వెంట అనేకమంది యువకులు నడిచారని విఠల్రావు పేర్కొన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కడవరకు పార్టీకి అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చలమాల సూర్యనారాయణ ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని, పాలక ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.