TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్.
సత్తుపల్లి ఆగస్టు 09: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తుంబూరు గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డుపడుతోందన్న కారణంతో అత్త గుండాల వెంకట నర్సమ్మను హత్య చేసిన కేసులో అల్లుడు వెదుళ్ల తిరుపతిరావు, అతని ప్రియురాలు పగుట్ల సునీతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కల్లూరు ఇన్చార్జి ఏసీపీ సారంగపాణి (వైరా ఏసిపి) తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతిరావుకు ఇద్దరు భార్యలు కాగా, తుంబూరులో ఉంటున్న రెండో భార్య మంగమ్మతో కలిసి జీవిస్తున్నాడు. కొంతకాలంగా భర్తను కోల్పోయిన తుంబూరు గ్రామానికి చెందిన సునీతతో అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం మంగమ్మతో పాటు ఆమె తల్లి వెంకట నర్సమ్మకు తెలియడంతో తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. జూలై 30న సునీత పనిచేస్తున్న ఇంటి వద్దకు మంగమ్మ, వెంకట నర్సమ్మ వెళ్లి ఆమెను మందలించి కొట్టడంతో అవమానంగా భావించిన సునీత, తిరుపతిరావుతో కలిసి వెంకట నర్సమ్మను హత్య చేయాలని పథకం వేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆగస్టు 2వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ వెంకట నర్సమ్మ ఇంటికి వెళ్లి, ఆమె టీవీ చూస్తూ కూర్చున్న సమయంలో చీర కొంగుతో మెడకు బిగించి హత్య చేసినట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తిరుపతిరావు మోటార్సైకిల్పై తీసుకెళ్లి నారాయణపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని రోడ్డు పక్కన ఎండిపోయిన కట్టెలు, కొబ్బరి మట్టలు, చెత్తలో వేసి పెట్రోల్తో నిప్పంటించినట్లు పేర్కొన్నారు.
మరుసటి రోజు మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో మరోసారి చెత్త, కొబ్బరి మట్టలతో కప్పి వెళ్లినట్లు, ఆగస్టు 3న రాత్రి మిగిలిన శరీర భాగాలను మరోచోటికి తరలించి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ సారంగపాణి వెల్లడించారు.