TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, చండ్రుగొండ మండలం, ఆగస్ట్ 23. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ఆదివారం చండ్రుగొండ మండల పరిధిలోని గుర్వాయిగూడెం, రావికంపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే జారె విస్తృతంగా పర్యటించారు.
గుర్వాయిగూడెం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం రావికంపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామ దేవతల బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే గ్రామానికి చెందిన పాయం మాధవి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనారోగ్యంతో ఉన్నవారికి పరామర్శ :
పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన రామిశెట్టి నరసింహస్వామిని ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అలాగే చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న షేక్ అమీర్ను కూడా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.
మృతురాలి కుటుంబానికి సానుభూతి :
ఇటీవల కాంగ్రెస్ పార్టీ గ్రామ సేవాదళ్ అధ్యక్షుడు రేఖం నరేష్ మాతృమూర్తి దివంగత రేఖం కాంతమ్మ మృతి చెందడంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వారి కుటుంబాన్ని పరామర్శించారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శోకసంతప్త కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.