TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, హైదరాబాద్ , ఆగస్ట్ 24. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, గుజ్జ కృష్ణ, కోల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలోని బీసీల ఆత్మగౌరవం, హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పండుగ సాయన్న, చాకలి ఐలమ్మ, కొమరం భీమ్ వంటి ఎందరో పోరాటాలు చేశారని, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వర్గాల సామాజిక చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చారని గుర్తుచేశారు.
బీసీలను కులాల వారీగా విభజించి అధికారానికి దూరంగా ఉంచే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని, అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలను ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ప్రత్యేకంగా కులాల వారీగా లెక్కించి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
మొదటి విడతలో బీసీ కుటుంబాలను కూడా లెక్కించాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదని, రెండో విడతలో బీసీలను లెక్కిస్తామని చెప్పినా అమలు చేయడం లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఒకే కులానికి వివిధ రాష్ట్రాల్లో భిన్న పేర్లు ఉండటంతో సమగ్ర కులగణన అవసరమన్నారు.
బీసీలకు కులగణన నిర్వహించి, జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారంలో వాటా, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించే వారికే బీసీల మద్దతు ఉంటుందని తెలిపారు. పార్టీ జెండాలను పక్కన పెట్టి బీసీ యువత ఐక్యంగా ముందుకు వచ్చి రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.