TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి, ఆగస్టు 25: సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు రాష్ట్ర స్థాయిలో మరో కీలక బాధ్యత దక్కింది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా రాగమయి దయానంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయగా, మంగళవారం అసెంబ్లీలో డాక్టర్ రాగమయి దయానంద్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ కమిటీకి నారాయణపేట శాసనసభ్యులు చిట్టెం పర్ణికా రెడ్డిని చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. కమిటీ సభ్యులుగా పలువురు శాసనసభ్యులకు అవకాశం కల్పించింది. అందులో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు కూడా స్థానం దక్కింది.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కి వరుస బాధ్యతలు…
ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తున్న డాక్టర్ రాగమయి దయానంద్‌కు రాష్ట్ర స్థాయిలో వరుసగా కీలక బాధ్యతలు దక్కుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సత్తుపల్లి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు పీసీసీ జనరల్ సెక్రటరీగా, దిశా కమిటీ సభ్యురాలిగా, పీసీసీ డాక్టర్స్ కమిటీ సభ్యురాలిగా, ఎస్సీ–ఎస్టీ కమిటీ సభ్యురాలిగా, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలో కోఆర్డినేటర్‌గా ఆమె వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తాజాగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా నియమించడంతో ఆమెకు మరో కీలక బాధ్యత లభించినట్లయింది.
నియోజకవర్గ పనితీరు చూసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇస్తున్నారా ?
సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ప్రజలతో కొనసాగిస్తున్న అనుసంధానం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర స్థాయిలో కూడా ప్రాధాన్యత లభిస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తక్కువ వ్యవధిలోనే రాష్ట్ర, పార్టీ స్థాయిలో పలు బాధ్యతలు దక్కడం ఆమెపై పార్టీ, ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి సంకేతంగా కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.
ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలను పరిశీలించే రాష్ట్ర కమిటీలో సభ్యురాలిగా అవకాశం కల్పించడం ద్వారా ఆయా వర్గాల సమస్యలను శాసనసభ స్థాయిలో ప్రస్తావించేందుకు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణలో భాగస్వామ్యం కావడానికి అవకాశం లభించనుంది.
హర్షం వ్యక్తం చేస్తున్న సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు.
డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడంపై సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన పలు బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఆమెకు వరుసగా కీలక బాధ్యతలు లభిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయిలో లభించిన ఈ కొత్త బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి మరింత కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షించారు.