TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. సూర్యాపేట ఆగస్ట్ 26 : జిల్లాలోని కోదాడ మండలం దొరకుంట వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. కంటైనర్లో ఉన్న భారీ ఇనుప కడ్డీలు బస్సులోకి దూసుకెళ్లడంతో బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగం, డ్రైవర్ అప్రమత్తత లోపం వంటి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.