TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, వేంసూరు మండలం, ఆగస్ట్ 25. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ఎర్రగుంటపాడు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పది మంది మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో 10 మంది గాయపడ్డారు.
స్థానికుల వివరాల ప్రకారం.. మహిళా కూలీలు మిరప నారు వేసేందుకు ఆటోలో రాయుడుపాలెం వెళ్తుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా పిల్లి రోడ్డుపైకి వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, గాయపడిన వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి ప్రథమ చికిత్స అందించారు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మిగిలిన వారికి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆటో అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.