TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం జిల్లా, సెప్టెంబర్ 22. గణేష్ నవరాత్రుల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా సుమారు 2,700 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని, ప్రమాదాలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు కొన్ని మార్గదర్శకాలను సూచించిన పోలీస్ శాఖ.
🔹 గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
🔹 నిమజ్జనం కోసం పోలీసులు ఏర్పాటు చేసిన నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించాలి.
🔹 ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లను పాటిస్తూ పోలీసులకు పూర్తిగా సహకరించాలి.
🔹 నిమజ్జన ఊరేగింపుల్లో అధిక వేగంతో వాహనాలు నడపడం, ప్రమాదకర విన్యాసాలు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదు.
🔹 నిమజ్జన ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు,మహిళల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
🔹 ఊరేగింపులో డీజేలు, భారీ శబ్దాలు మరియు ప్రమాదకర విన్యాసాలకు దూరంగా ఉండాలి.
🔹 వాహనాలపై పరిమితికి మించి వ్యక్తులను ఎక్కించుకోవద్దు.
🔹 చెరువులు, నీటి వనరుల వద్ద బారికేడ్లను దాటి నీటిలోకి వెళ్లరాదు.
🔹 విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
🔹 ఊరేగింపు సమయంలో మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం వంటి చర్యలకు పాల్పడరాదు.
🔹 ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలి.
నిబంధనలు పాటించని వారిపై పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్త్ హెచ్చరించారు.