TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్ సెప్టెంబర్ 18: జిల్లాలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్‌ కార్యాలయంలో పలు అంశాలపై వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లాలోని రైతాంగ సమస్యలు, ప్రజా సంక్షేమ పథకాలు, సాగునీరు, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై అభ్యంతరం

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల L1, L2 కేటగిరీల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. అధికార పార్టీ క్యాంపు కార్యాలయాల్లో రూపొందించిన అనధికారిక జాబితాలను ఎంక్వైరీలకు పంపుతున్నారని, దీనివల్ల స్థానిక సర్పంచుల హక్కులు, స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తి దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. వెంటనే ఆ జాబితాలను రద్దు చేసి, సర్పంచుల అధ్యక్షతన అధికారికంగా గ్రామసభలు నిర్వహించి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు.

11 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సమస్య

సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండల పరిధిలోని సిరిపురం మేజర్‌ కాలువ ఆధునికీకరణ పనులు పెండింగ్‌లో ఉండటంతో సుమారు 11 వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని నాయకులు తెలిపారు. సమీపంలో సీతారామ సాగర్‌ జలాలు ప్రవహిస్తున్నప్పటికీ పెండింగ్‌ పనుల కారణంగా కాలువలోకి నీరు చేరడం లేదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సాగునీటిని విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరారు.

ఎత్తిపోతల పథకాలకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలి

పెనుబల్లి మండలంలోని రాతోని, తాళ్లపెంట ఎత్తిపోతల పథకాల పరిధిలోని రైతుల సమస్యను కూడా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాతోని పథకం పరిధిలో 2,300 ఎకరాలు, 5 గ్రామాలు, తాళ్లపెంట పథకం పరిధిలో 1,600 ఎకరాలు, 2 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. మొత్తం సుమారు 3,900 ఎకరాల ఆయకట్టుకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురై ఏడాది గడుస్తున్నా పునరుద్ధరించలేదని పేర్కొన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయినందున ఆలస్యం చేయకుండా వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి రైతుల చేతికొచ్చిన పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

జింకలతండాలో ఈద్గా, ఖబరస్థాన్‌కు స్థలం కేటాయించాలని వినతి

రఘునాథపాలెం మండలం జింకలతండా పరిధిలో గత 55 సంవత్సరాలుగా ఈద్గా, ఖబరస్థాన్‌కు సరైన స్థలం లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. ఇప్పటికే కేటాయించేందుకు గుర్తించిన ప్రభుత్వ భూమికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి, గ్రామస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ను కోరారు.

జిల్లాలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలెక్టర్‌ను కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *