TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి మండలం సెప్టెంబర్ 26: ఇంట్లో బల్బు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై 16 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన పెనుబల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
బీసీ కాలనీకి చెందిన నరసింహారావు–సంధ్య దంపతులకు కుమారుడు తోట గౌతమ్ (16), కుమార్తె ఉన్నారు. శనివారం సాయంత్రం ఇంట్లో బల్బు ఏర్పాటు చేసేందుకు గౌతమ్ ప్రయత్నిస్తుండగా, జాయింట్ ఉన్న విద్యుత్ తీగలు అతని శరీరానికి తగలడంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు.
ఈ ఘటనను గమనించిన తల్లి సంధ్య, గౌతమ్ను విద్యుత్ తీగల నుంచి తప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. విద్యుత్ షాక్తో గౌతమ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మం తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే గౌతమ్ మృతి చెందాడు.
అనంతరం మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పెనుబల్లి ఎస్సై షేక్ షాకీర్ సిబ్బందితో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఘటనపై విచారణ చేపట్టారు.
గౌతమ్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.