సత్తుపల్లి, అక్టోబర్ 11: తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆదివారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాపూజీ చేసిన సేవలను, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగించిన పోరాటాన్ని నాయకులు స్మరించుకున్నారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రిహానా బేగం, కమల్ పాషా, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ కౌన్సిలర్లు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, పసుమర్తి చందర్ రావు, విగ్రహావిష్కరణ నిర్వాహకులు, రిటైర్డ్ ఎస్ఈ పద్మారావు, పద్మశాలి సంఘం కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.