ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి.. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి, అక్టోబర్ 10: సీపీఎం జాతీయ కార్యదర్శి ఎం.ఏ. బేబీ, కేంద్ర కమిటీ సభ్యుల అరెస్టులను ఖండిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ పెనుబల్లి మండలం వి.ఎం. బంజర్లోని అంబేద్కర్ సెంటర్లో సీపీఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అరెస్టులను నిరసించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, చలమాల విఠల్రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై అరెస్టులకు పాల్పడటం సరైన విధానం కాదని అన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న హక్కులని పేర్కొన్నారు.
అరెస్టుల ద్వారా ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు విమర్శించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అక్రమ అరెస్టులను నిలిపివేసి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, రైతు సంఘం మండల కార్యదర్శి చిట్టి మోదుల కృష్ణయ్య, కండ సత్యం, గుడిమెట్ల బాబు, హమాలీ వర్కర్స్ అధ్యక్షుడు మిద్దె స్వామి, ఏ. నాగయ్య, వెంకటేశ్వరరావు, సేవియా, రాములు, చెన్నారావు, కలకోట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.