TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. సత్తుపల్లి, అక్టోబర్ 12 : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ఆడపడుచుల ఆనందానికి చిరునామాగా మారిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ అన్నారు.
సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ గణపతి టెంపుల్, సరస్వతీ దేవి టెంపుల్, రామాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే బతుకమ్మ వేడుకలు తెలంగాణ మహిళల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.