TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. సత్తుపల్లి, అక్టోబర్ 12, 2026: సింగరేణి కార్మికులు, అధికారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ, దసరా పండుగ సందర్భంగా బోనస్ అందిస్తూ అండగా నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
గతంలో అధికారులకు మాత్రమే బోనస్ ప్రకటించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు సైతం బోనస్ అందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.
సింగరేణి బ్లాక్-3 సమస్య పరిష్కారానికి కృషి
సింగరేణి బ్లాక్-3కు సంబంధించిన సమస్యను త్వరితగతిన పరిష్కరించి, తిరిగి సింగరేణి సంస్థకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
సింగరేణి బాధితులకు న్యాయం చేస్తాం
సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సింగరేణి కారణంగా ప్రభావితమైన బాధితులకు స్థల సేకరణతో పాటు ఆర్ అండ్ ఆర్ (పునరావాసం, పునరుద్ధరణ) ప్యాకేజీ అందించే అంశంపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సింగరేణి నిధులు
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీ స్థాయికి అభివృద్ధి చేసేందుకు సింగరేణి సంస్థ ద్వారా నిధులు కేటాయించే అంశంలోనూ సానుకూలత వ్యక్తమైందని ఎమ్మెల్యే తెలిపారు.
సింగరేణి కార్మికుల సంక్షేమం, బాధిత కుటుంబాలకు న్యాయం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డా. మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు.