TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. సత్తుపల్లి, అక్టోబర్ 15: రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి అధికారులపై నెపం నెట్టడం దురదృష్టకరమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు.
గురువారం సత్తుపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 7,778 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 19,450 మెగావాట్లకు పెంచడంతో పాటు, సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని విస్తృతంగా అభివృద్ధి చేశామని వివరించారు.
కొత్తగూడెం, భద్రాద్రి, యాదాద్రి తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత నెల రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలపై ప్రజలు, రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన విద్యుత్ మౌలిక సదుపాయాలు, పనిచేసిన అధికార యంత్రాంగమే ప్రస్తుతం ఉన్నప్పటికీ విద్యుత్ సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఎల్నినో ప్రభావాన్ని సాకుగా చూపుతూ బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదన్నారు. రాజకీయ విమర్శలు, అధికారులపై నిందలు వేయడం మానుకొని ప్రజలకు, రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడంపై దృష్టి సారించాలని సూచించారు. విద్యుత్ సమస్యల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని, అవసరమైన ప్రాంతాల్లో కరువు మండలాలను ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.