TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, అన్నపురెడ్డిపల్లి మండలం, జూన్ 23.అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు. సోమవారం అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు.
తొట్టిపంపు గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న డైనింగ్ హాల్ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అన్నపురెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేశారు.
పెంట్లం గ్రామపంచాయతీ పరిధిలోని భాస్కరపురం, కంపగూడెం, నామవరం గ్రామాల్లో రూ.30 లక్షల వ్యయంతో మూడు ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించారు. నరసాపురం గ్రామపంచాయతీ పరిధిలోని నరసాపురం రాజాపురం గ్రామాలలో రూ.15 లక్షల వ్యయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించనున్న సీసీ రోడ్లు కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయతీ పరిధిలోని పలు వీధుల్లో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి విద్యా సంస్థల బలోపేతం మెరుగైన రహదారి సౌకర్యాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అనుబంధ సంఘాల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.