TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, వైరా టౌన్, జూన్ 25న ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. వైరాలో బుధవారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో ప్రతిపక్ష ఓటర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతి అర్హుడి ఓటు నమోదై ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన బట్టి విక్రమార్క : – కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు. గత ప్రభుత్వ అప్పుల భారం మోస్తూనే ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ వంటి పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. రైతు ఆశీర్వాద మహాసభకు వైరా నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో రైతులు హాజరై విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.