TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, జులై 20. ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను వీఎం బంజర్ పోలీసులు అరెస్టు చేసినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. వీఎం బంజర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
షేక్ జానీ @ జానీ షరీఫ్, పేరాల నరసింహారావు @ బాబీ, అర్వ ఉదయ్ కుమార్లను క్రైమ్ నం.123/2026, సెక్షన్లు 331(4), 305 బీఎన్ఎస్ కేసులో జూలై 19న సాయంత్రం సీతారామపురం గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒక కారు, ఒక మోటార్సైకిల్పై దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను అమ్మేందుకు తిరువూరు వెళ్తుండగా పట్టుకుని, పంచుల సమక్షంలో విచారించగా నేరాలకు సంబంధించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసుల విచారణలో ముగ్గురు నిందితులు పాత నేరస్తులేనని తేలిందని ఏసీపీ వెల్లడించారు. షేక్ జానీపై కొత్తగూడెం టూ టౌన్, పాల్వంచ, ఇల్లందు పోలీస్ స్టేషన్లలో ఇళ్ల దొంగతనాల కేసులు, లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో డెకాయిటీ కేసు నమోదై ఉండగా, పేరాల నరసింహారావుపై హైదరాబాద్ ఎల్బీనగర్తో పాటు ములకలపల్లి, నేలకొండపల్లి, గోకవరం పోలీస్ స్టేషన్లలో దేవాలయ దొంగతనాల కేసులు ఉన్నాయని తెలిపారు. అర్వ ఉదయ్ కుమార్పై కూడా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో డెకాయిటీ కేసు నమోదై ఉందన్నారు.
నిందితుల వద్ద నుంచి 24 గ్రాముల బంగారం, 1.536 కిలోల వెండి వస్తువులు, ఒక కారు, ఒక మోటార్సైకిల్తో పాటు ఇనుప రాడ్, సుత్తి, కటింగ్ ప్లేయర్, స్క్రూడ్రైవర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా దేవాలయ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఏసీపీ సూచించారు.