TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి, ఆగస్టు 8: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చిన్నమ్మగూడెం గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గ్రామ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ముత్యాలమ్మకు, బొడ్రాయికి నీళ్లు పోసి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి అమ్మవారిని వేడుకున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామంలో పాడిపంటలు కళకళలాడాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మహిళలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మకు నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.