TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం ఆగస్ట్ 26: రఘునాథపాలెం మండలం జింకలతాండలో 13.10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న స్వామినారాయణ గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు.

ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన అందించనుండగా, సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో క్యాంపస్‌ రూపుదిద్దుకోనుంది. గిరిజన ప్రాంతాలతో పాటు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. విద్యతో పాటు మానవతా విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ, నైతిక విలువలకు గురుకుల విద్యలో ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. తెలంగాణలో స్వామినారాయణ గురుకుల్‌కు ఇది ఐదో విద్యాసంస్థ అని తెలిపారు. పాఠశాలలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను ఎలాంటి ఫీజు లేకుండా నిరుపేద విద్యార్థులకు కేటాయించేలా జిల్లా కలెక్టర్‌కు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సుడా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మహ్మద్ ఖాదర్ బాబా, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్‌డీఓ ఎన్. శ్రీనివాస్, స్వామినారాయణ గురుకుల్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *