వంతెన కూలిన ఘటనపై ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు

అధికారులతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమీక్ష,

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ములకలపల్లి, సెప్టెంబర్ 24: ములకలపల్లి మండలం కంపగూడెం శివారులో కూలిపోయిన పాములేరు వాగు వంతెనను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంతెన కూలిపోవడంతో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల రవాణా ఇబ్బందులను తొలగించేందుకు త్వరలోనే రూ.5 కోట్ల నిధులతో పాములేరు వాగుపై నూతన వంతెన నిర్మాణం చేపడతామని తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రహదారి మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

అనంతరం ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుపై ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్‌అండ్‌బీ డీఈ విశ్వనాథ్, ఎస్సై మధు ప్రసాద్, విద్యుత్ శాఖ ఏఈ నరేష్ కుమార్ తదితర అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.

పాల్వంచ వైపు వెళ్లే భారీ వాహనాలను సత్తుపల్లి మీదుగా దారి మళ్లించాలని అధికారులను ఆదేశించారు. కార్లు, ద్విచక్ర వాహనాలను మాదారం, అన్నపురెడ్డిపల్లి, బుగ్గపాడు మీదుగా దమ్మపేటకు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా దమ్మపేట నుంచి వచ్చే వాహనాలను కంపగూడెం అడ్డరోడ్డు, తిమ్మంపేట, బూర్గంపాడు మీదుగా పాల్వంచకు చేరుకునేలా దారి మళ్లింపు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా వ్యవస్థను పునరుద్ధరించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయా మండలాల అధికారులతో సమీక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.డి. జహీరుద్దీన్, జిల్లా నాయకుడు, మాజీ జెడ్పీటీసీ బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పాలకుర్తి సుమిత్, సురభి రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *