రాథోనీ లిఫ్ట్ ఆయకట్టు రైతులకు అండగా ఉంటామని స్పష్టీకరణ.
ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి, అక్టోబర్ 20: పెనుబల్లి మండల రైతాంగానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కనగాల సాంబశివరావు హృదయపూర్వక విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యంగా మండల పరిధిలోని రాథోనీ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు రైతులకు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో కీలక సహకారం అందించిన సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు, దసరా శుభాకాంక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా కనగాల సాంబశివరావు మాట్లాడుతూ… చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ విజయదశమి పర్వదినాన రైతులందరికీ వ్యవసాయంలో ఆశించిన మేర మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షించారు.
రాథోనీ లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరలోనే శాశ్వతంగా పరిష్కారమై, ప్రతి ఎకరాకూ సమృద్ధిగా సాగునీరు అందాలని కోరారు. రైతుల జీవితాల్లో ఆనందం నిండాలని, అన్నదాతలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.