కిష్టారంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. కిష్టారం, అక్టోబర్ 09: సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ పాల్గొన్నారు. శుక్రవారం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కిష్టారం హైస్కూల్లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, తరగతి గదులను ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాలు పాఠశాల అభివృద్ధికి దోహదపడనున్నాయి.
అనంతరం బీసీ హాస్టల్ వద్ద నిర్మించిన సీసీ రోడ్డును, అంబేద్కర్ నగర్లో ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. బీసీ కాలనీలో హ్యూమన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన మినీ ఫంక్షన్ హాల్తో పాటు ఎస్సీ కాలనీలో ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం, విద్యా రంగ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చేపట్టిన కార్యక్రమాలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.