TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. ఖమ్మం టౌన్ సెప్టెంబర్ 15. గంజాయి వినియోగం, సరఫరా నియంత్రణతో పాటు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన భవనాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి వినియోగం, విక్రయాలు, సరఫరాకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రధాన సరఫరాదారులను గుర్తించి వారి నెట్‌వర్క్‌ను ఛేదించడంతో పాటు వినియోగదారులను కూడా గుర్తించాలని తెలిపారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా నిఘా, తనిఖీలు, అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

సైబర్ నేరాల నియంత్రణకు సమర్థవంతమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని, డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సీపీ సూచించారు.

బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ మోసపోయిన నగదును వీలైనంత త్వరగా ఫ్రీజ్ చేయించి బాధితులకు తిరిగి అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి కారణాలను విశ్లేషించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్‌రూట్ డ్రైవింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రధాన రహదారులు, జంక్షన్లు, ప్రమాదకర మలుపుల వద్ద నిరంతర నిఘా, వాహన తనిఖీలు చేపట్టి ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *