- ఆడపడుచులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
- మామిళ్లవారిగూడెంలో ఘనంగా పూల పండుగ సంబరాలు
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. అశ్వారావుపేట, అక్టోబర్ 17: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు పల్లెల్లో పండుగ శోభను సంతరించుకున్నాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా అశ్వారావుపేట మండలంలోని కొత్త మామిళ్లవారిగూడెం, పాత మామిళ్లవారిగూడెం గ్రామాల్లో శనివారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలతో సందడి చేయగా, ఎమ్మెల్యే వారితో కలిసి ఆడిపాడి ఉత్సాహపరిచారు. ప్రజాప్రతినిధి తమతో కలిసి వేడుకల్లో మమేకం కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం మరింత సంతరించుకుంది.
అనంతరం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధిస్తూ, ఆడపడుచుల ప్రేమానురాగాలకు అద్దంపట్టే పూల పండుగ బతుకమ్మ అని కొనియాడారు. తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు సగర్వంగా అందించే గొప్ప వేడుక ఇదని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వగ్గెల లక్ష్మణరావు, ఉప సర్పంచ్ వీర్నాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.