TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి మండలం, అక్టోబర్ 17: రైతుల పొలాల్లోని వ్యవసాయ విద్యుత్ మోటార్లు, కేబుల్ వైర్లను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వి.ఎం. బంజర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 2.80 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని, ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వి.ఎం. బంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ బావులు, బోర్ల వద్ద వరుస చోరీలు జరగడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. క్రైమ్ నెంబర్లు 196/2026, 197/2026, 198/2026, 199/2026, 200/2026 ల కింద మొత్తం ఐదు కేసులు నమోదు చేసి విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వివరాలు:
పోలీసుల విచారణలో నిందితులు తమ వివరాలను వెల్లడించారు. వీరిలో పెనుబల్లి మండలం గణేష్పాడుకు చెందిన రావూరి పవన్ కళ్యాణ్ (ఇతనిపై గతంలో క్రైమ్ నెం. 02/2022, 90/2021 కేసులు ఉన్నాయి), తిరువూరు మండలం కోకిలంపాడుకు చెందిన జొన్నలగడ్డ నాగరాజు (ఇతనిపై క్రైమ్ నెం. 90/2021 కేసు ఉంది), గణేష్పాడుకు చెందిన కళ్ళం జగన్, రావూరి నాగేశ్వరరావు, పాత కారాయిగూడెం వాసి ఎస్.కె. రఫీ, ముత్తగూడెంకు చెందిన రావూరి సాలు అలియాస్ సల్మాన్, పెనుబల్లికి చెందిన రావూరి లక్ష్మణరావు అలియాస్ వరప్రసాద్ ఉన్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
నిందితుల నుంచి సుమారు రూ. 2,80,000/- విలువ గల 7 విద్యుత్ మోటార్లు.
200 మీటర్ల కేబుల్ వైర్
మోటార్ స్టార్టర్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఏడుగురిలో నలుగురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సత్తుపల్లి రూరల్ సీఐ సర్వయ్య మాట్లాడుతూ.. రైతుల ఆస్తులకు నష్టం కలిగిస్తూ దొంగతనాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రైతులు తమ మోటార్లు, పరికరాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.