మధ్యతరగతి సంక్షేమానికి రక్షణ కవచం
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. తల్లాడ, అక్టోబర్ 8: రేషన్ కార్డు అనేది కేవలం సబ్సిడీ బియ్యం తీసుకునేందుకే పరిమితం కాదని, పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి అదొక కీలక రక్షణ కవచమని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ స్పష్టం చేశారు. గురువారం తల్లాడ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఆమె చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించే ‘ఆరోగ్యశ్రీ’, విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపకరించే ‘స్కాలర్షిప్లు’, అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (ఇన్కమ్ సర్టిఫికేట్లు) వంటి అత్యవసర ప్రభుత్వ సేవలను పొందడానికి రేషన్ కార్డు ఎంతో ప్రాముఖ్యమైనదని వివరించారు.
గత ప్రభుత్వంపై ధ్వజం
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డుల జారీని పూర్తిగా గాలికొదిలేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. దీనివల్ల నియోజకవర్గంలోని వేలాది నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ పథకాలు అందక, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా సకాలంలో కార్పొరేట్ వైద్యం పొందలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. పేదల హక్కులను కాలరాసిన ఘనత గత పాలకులకే దక్కుతుందన్నారు.
ప్రతి గడపకు ప్రభుత్వ పథకం.
ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే రాగమయి అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు దక్కాలన్నదే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. లక్ష్మారెడ్డి, మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.