రెండు నెలల పాటు స్వర్ణోత్సవ సంబరాలు.
పూర్వ విద్యార్థుల సమన్వయంతో పలు కమిటీల ఏర్పాటు.

ఉత్సవాలను విజయవంతం చేయాలని డాక్టర్ మట్టా దయానంద్ పిలుపు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. సత్తుపల్లి అక్టోబర్ 18 : స్థానిక జేవీఆర్ (JVR) ప్రభుత్వ డిగ్రీ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న ‘గోల్డెన్ జూబ్లీ’ (స్వర్ణోత్సవ) వేడుకల సన్నాహక సమావేశం ఆదివారం కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ మట్టా దయానంద్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ… సత్తుపల్లి ప్రాంత విద్యా వికాసంలో జేవీఆర్ డిగ్రీ కళాశాల ఎంతో మంది ఉన్నత స్థాయి వ్యక్తులను తీర్చిదిద్దిందని కొనియాడారు. 50 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని రాబోయే రెండు నెలల పాటు స్వర్ణోత్సవ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇందుకు సంబంధించిన భారీ ఏర్పాట్లపై సమావేశంలో హాజరైన పూర్వ విద్యార్థులతో సమగ్రంగా చర్చించి, వారి నుంచి పలు సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ బాధ్యతలతో కూడిన పలు కమిటీలను సమావేశంలో ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు.

కళాశాలలో చదివి వివిధ రంగాలలో స్థిరపడిన ప్రతి పూర్వ విద్యార్థితో పాటు, ప్రస్తుత విద్యార్థులు కూడా భాగస్వాములై, కష్టపడి శ్రమించి ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను చిరస్మరణీయంగా మార్చాలని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *